సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య!

Published on: 07 May 2026, 09:31 AM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 07, 2026

ఏలూరు: ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో జరిగిన రెడ్డి సులోమన్ రాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి భార్యే సూత్రధారి అని విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. వడ్డమాను గ్రామానికి చెందిన మృతుడు సులోమన్ రాజు భార్య రెడ్డి దుర్గామణికి, సచివాలయంలో పనిచేసే పలగాని వెంకన్నబాబుతో అక్రమ సంబంధం ఉంది. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించిన దుర్గామణి, తన ప్రియుడు వెంకన్నబాబుతో కలిసి హత్యాపథకం రచించింది. మృతుడిని చంపేందుకు సుమారు రూ. 12 లక్షల రూపాయలు సుపారీగా ఇచ్చి కిరాయి హంతకులను పురమాయించారు. గన్నవరం మండలం కొండపావులూరు వద్ద ప్లాన్ ప్రకారం సులోమన్ రాజును కిరాయి హంతకులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏలూరు ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలతో నూజివీడు పోలీసులు రంగంలోకి దిగి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను గుర్తించారు. భార్య దుర్గామణితో పాటు ప్రియుడు వెంకన్నబాబు, కిరాయి హంతకులు సాయి శ్రీనివాస్, జస్వంత్ రాయ్, మణికంఠలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ఒక కారు, ఐదు సెల్ ఫోన్లు మరియు రూ. 75,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.