సుప్రీంకోర్టు నిర్ణయంతో షాక్..అజారుద్దీన్ రాజీనామా తప్పదా?

Published on: 23 Apr 2026, 04:08 AM
News Article

హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. ప్రొఫెసర్ కోదండరాం మరియు మొహమ్మద్ అజారుద్దీన్లను ఎమ్మెల్సీలుగా ఆమోదించే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు గవర్నర్‌కు జులై 22 వరకు సమయం ఇచ్చింది. అటార్నీ జనరల్ విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ గడువును పెంచింది.

అసలేం జరిగింది?

రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఎమ్మెల్సీ నామినేషన్లపై నిర్ణయం తీసుకునేందుకు కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు మరింత సమయం కావాలని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టును కోరారు. ప్రభుత్వం పంపిన నామినేషన్లు రాజ్యాంగబద్ధంగా సరిగ్గా ఉంటే గవర్నర్ ఆమోదిస్తారని, లేకపోతే తిరస్కరిస్తారని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన కోర్టు, ప్రస్తుతం గవర్నర్–గవర్నమెంట్ మధ్య సఖ్యత లేదా? అని ప్రశ్నిస్తూనే విచారణను జులైకి వాయిదా వేసింది.

అజారుద్దీన్ మంత్రి పదవిపై ఉత్కంఠ:

ఈ కోర్టు నిర్ణయం ఇప్పుడు మంత్రి అజారుద్దీన్ పదవిపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది.

  • డెడ్ లైన్: రాజ్యాంగం ప్రకారం, మంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తి 6 నెలల లోపు అసెంబ్లీ లేదా కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికవ్వాలి.
  • అజారుద్దీన్ గారు అక్టోబర్ 31, 2025న మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 6 నెలల గడువు ఏప్రిల్ 30, 2026తో ముగియనుంది.
  • ఒకవేళ ఏప్రిల్ 30లోపు గవర్నర్ ఆమోదం తెలపకపోతే, అజారుద్దీన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వం ముందున్న ఆప్షన్లు:

గవర్నర్ జులై వరకు సమయం తీసుకుంటే, ప్రభుత్వం అజారుద్దీన్ గారిని మంత్రిగా కొనసాగించేందుకు మరేదైనా ప్రత్యామ్నాయం వెతుకుతుందా? లేదా ఆయన రాజీనామా చేయక తప్పదా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.