సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య..
హైదరాబాద్ న్యూస్‌టైమ్, మహబూబాబాద్, జూన్ 08, 2026: నూతన సాంకేతిక వస్తువులపై మోజు, క్షణికావేశం ఓ యువతి ప్రాణాన్ని బలితీసుకుంది. కొత్త సెల్‌ఫోన్ కొనివ్వలేదనే మనస్తాపంతో ఓ యువతి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మట్టెవాడ గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి మట్టెవాడకు చెందిన బిందు అనే యువతి తనకు సెల్‌ఫోన్ కొనివ్వాలని తండ్రిని కోరింది. ప్రస్తుతానికి డబ్బులు లేవని తండ్రి చెప్పడంతో ఆమె తీవ్ర క్షణికావేశానికి గురై రాత్రి వేళ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది. రాత్రి నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. తీరా ఆదివారం ఉదయం ఇంటి సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో బిందు శవమై తేలడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.