హైదరాబాద్, నవంబర్ 26, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్):కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డితో పాటు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిలకు రెండు వారాల పాటు జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఒక భూ వివాదానికి సంబంధించిన కేసులో పిటిషనర్‌కు రక్షణ కల్పించాలని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసినందుకు న్యాయస్థానం ఈ కఠిన చర్య తీసుకుంది.
వారం రోజుల్లోగా స్టే తెచ్చుకోకపోతే లొంగిపోవాల్సిందే: కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు గానూ ఇద్దరు ఉన్నతాధికారులకు జైలు శిక్ష విధించిన ధర్మాసనం, ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో వారం పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, ఈ జైలు శిక్ష అమలుపై హైకోర్టు వారం రోజుల పాటు తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. వారం రోజుల్లోపు ఉన్నత ధర్మాసనం నుంచి ఎలాంటి స్టే ఉత్తర్వులు తెచ్చుకోకపోతే, హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోయి జైలు శిక్ష అనుభవించాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.