సైబర్ నేరాలప‌ట్ల‌ ప్రజలు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి: చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్

Published on: 11 Aug 2026, 02:35 PM
News Article

చౌటుప్పల్, ఆగస్ట్ 11, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలోని సవారియా కంపెనీలో మంగళవారం సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగులు మరియు ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీ, పిన్, సీవీవీ, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ ఖాతా వివరాలను ఎవరికీ వెల్లడించకూడదని, గుర్తుతెలియని లింకులు, మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని హెచ్చరించారు. ఆన్‌లైన్ పెట్టుబడులు, ఉద్యోగాలు, రివార్డులు, లోన్ల పేరుతో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు సమాచారం అందించాలని సూచించారు. సైబర్ భద్రతపై అవగాహన పెంచుకోవడంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్సై యాది రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.