సౌత్ జోనల్ కార్యాలయంలో ఎల్ఐసీ 70వ వార్షికోత్స‌వ‌ వేడుకలు..

Published on: 01 Sep 2026, 01:32 PM
News Article

హైదరాబాద్, సెప్టెంబర్ 1, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) 70వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం సౌత్ జోనల్ కార్యాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్రమైన ఈ ప్రధాన కార్యాలయంలో జోనల్ మేనేజర్ శ్రవణ్ రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త, వాసవి గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎర్రం విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఎల్ఐసీకి విలువైన పాలసీదారుడిగా దశాబ్దాలుగా అనుబంధం ఉన్న ఎర్రం విజయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంస్థ భవిష్యత్తులో శతాబ్ది ఉత్సవాలను సైతం జరుపుకుంటూ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఎల్ఐసీ అనేది కేవలం బీమా సంస్థ మాత్రమే కాదని.. గ్యారెంటీ, విశ్వాసం, పవిత్రత, కుటుంబ ఆర్థిక భద్రతకు అది నిలువెత్తు రూపమని ఆయన కొనియాడారు. పిల్లల భవిష్యత్తు, ఉన్నత విద్య, వివాహం, పదవీ విరమణ తర్వాత జీవితానికి ఎల్ఐసీ పాలసీలు ఎంతో అవసరమని గుర్తుచేశారు. ఈ 70వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అద్భుతమైన సేవలు అందిస్తున్న ఎల్ఐసీ యాజమాన్యానికి, సంస్థను విశ్వసించి తమ కష్టార్జితాన్ని పొదుపు చేస్తున్న కోట్లాది మంది పాలసీదారులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఉద్యోగులు, డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, మార్కెటింగ్ ఏజెంట్లను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం కౌటికె విఠల్ మాట్లాడుతూ.. ఎల్ఐసీ సంస్థకు ఏజెంట్లే నిజమైన బలం, అసలైన ముఖచిత్రం అని స్పష్టం చేశారు. ఏజెంట్లు సంతృప్తిగా, ఉత్సాహంగా పనిచేసినప్పుడే ఏ సంస్థ అయినా మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వేడుకల్లో ఎల్ఐసీ వివిధ విభాగాలకు చెందిన రీజనల్ మేనేజర్లు, ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.