స్కాట్లాండ్ ఎంపీతో కేరళ మహిళ వివాహం
కేరళ, ఆగస్ట్ 21, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ప్రేమకు సరిహద్దులు లేవని నిరూపిస్తూ, స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే, కేరళకు చెందిన నిధిన్ చంద్‌ను వివాహం చేసుకున్నారు. మంగళవారం కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంలో వీరి వివాహం అత్యంత వైభవంగా, సన్నిహితులు మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.
ప్రేమ ప్రయాణం ఇలా.. నిధిన్ చంద్ ఉన్నత చదువుల కోసం 2008లో యునైటెడ్ కింగ్‌డమ్ (UK) వెళ్ళారు. అక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె, తర్వాత ఐటీ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ సమయంలో వీసా నిబంధనల మార్పుల వల్ల ఆమె ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో, అప్పటి UK ఎంపీగా ఉన్న మార్టిన్ డేని ఆమె కలిశారు. స్కాటిష్ నేషనల్ పార్టీకి చెందిన మార్టిన్ డేతో మొదలైన స్నేహం, కాలక్రమేణా ప్రేమగా మారింది. తొమ్మిదేళ్ల క్రితమే వీరు UKలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ, నిధిన్ చంద్ చిరకాల కోరిక మేరకు కేరళలోని గురువాయూర్ ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గతంలో కోవిడ్ మహమ్మారి, వరదలు, కుటుంబ కారణాల వల్ల ఆలయ సందర్శన వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి నాలుగో ప్రయత్నంలో ఈ జంట తమ వివాహ వేడుకను ఆలయంలో పూర్తి చేశారు. కాగా, మార్టిన్ డే స్కాటిష్ పార్లమెంట్‌లో భారత్-యూకే ద్వైపాక్షిక సంబంధాల కోసం పనిచేసే ఆల్-పార్టీ పార్లమెంటరీ గ్రూప్‌కు ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.