స్వయం ఉపాధితోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు
సంస్థాన్ నారాయణపురం, ఆగస్ట్ 30, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక యువకుడు వలిగొండ కిరణ్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసిన 'యాదాద్రి ఎంటర్ప్రైజెస్' షాపును డా. ఈఎల్‌వీ (ELV) భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ డా. ఈఎల్‌వీ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. భాస్కర్ మాట్లాడుతూ.. నేటి యువత కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని వ్యాపార రంగంలో అడుగుపెట్టాలని పిలుపునిచ్చారు. చిన్న స్థాయిలో వ్యాపారం ప్రారంభించినా.. కష్టపడే తత్వం, పట్టుదల, నూతన ఆలోచనలతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని స్పష్టం చేశారు. వ్యాపారంలో లాభాలతో పాటు నాణ్యత, నిజాయితీ, వినియోగదారుల నమ్మకానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని యువతకు సూచించారు. ప్రస్తుత ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న డిజిటల్ టెక్నాలజీ, ఆన్‌లైన్ మార్కెటింగ్, సోషల్ మీడియా వేదికలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాలను విస్తరించుకోవాలని ఆయన తెలిపారు. ఒక యువకుడు స్వయం ఉపాధి పొందడంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. స్వయం ఉపాధిలో రాణించాలనుకునే యువతకు డా. ELV భాస్కర్ ఫౌండేషన్ తరఫున అవసరమైన సహాయ సహకారాలు, మార్గదర్శకత్వం అందిస్తామని భరోసా ఇచ్చారు. యువత ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఈఎల్‌వీ అశోక్, వార్డు సభ్యులు సింగం భాస్కర్, పట్నం బాలకృష్ణ, ఫౌండేషన్ సభ్యులు ముత్యాలు, శికిలమెట్ల హేమంత్, స్థానిక ప్రజలు, యువత, వ్యాపారవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.