స్వాములవారి లింగోటంలో గ్రామసభ: అభివృద్ధి, మహిళా సాధికారతపై ప్రత్యేక అవగాహన
హైదరాబాద్, ఆగస్ట్ 2, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్ - చౌటుప్పల్ మండలం): చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం (స్వాములవారి లింగోటం) గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ భీమిలి ప్రదీప్ జీ అధ్యక్షతన గ్రామసభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జలసిరి, మహిళా సాధికారత, డ్రగ్స్ నిర్మూలనపై అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన చౌటుప్పల్ ఎంపీడీవో శ్రీలత మాట్లాడుతూ.. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారిన పడకుండా దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. సీడీఈడబ్ల్యూ కృష్ణవేణి మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ భీమిడి ప్రదీప్ జీ మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. గ్రామసభ అనంతరం శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి, హైస్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాతరాజు ధనంజయ్, ఎస్సై అజయ్ భార్గవ్, పంచాయతీ కార్యదర్శి కావ్య, వార్డు సభ్యులు, అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.