హైకోర్టు చెప్తేనే పని చేస్తారా?: రెవెన్యూ అధికారుల పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం!
Published on: 08 Jul 2026, 05:39 AM
హైదరాబాద్, జూలై 08, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఎరాజ్ పల్లెకు చెందిన లోకనడిపి హనుమాండ్లు అనే రైతు తన 20 గుంటల భూమి మ్యుటేషన్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు, రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భూ సర్వేలు, మ్యుటేషన్లు, పాస్ పుస్తకాల జారీ కోసం ప్రజలు నెలల తరబడి అప్లికేషన్లు పెట్టుకున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై మండిపడిన న్యాయస్థానం, "పాస్ పుస్తకాలకు 3 నెలలు, సర్వేకు 6 నెలల సమయం పడుతుందా? హైకోర్టు చెబితే తప్ప మీరు పని చేయరా?" అని ప్రశ్నించింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు, ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది.