హైడ్రా ఏర్పాటు వెనుక అసలు కుట్ర బట్టబయలు

Published on: 04 Aug 2026, 03:38 AM
News Article

హైదరాబాద్, ఆగస్ట్ 4, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): గత రెండేళ్లుగా 'హైడ్రా' (HYDRAA) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హడావిడి, ప్రభుత్వ భూముల పరిరక్షణ డ్రామా వెనుక అసలు కుట్ర బయటపడింది. ఆక్రమణల తొలగింపు మరియు చెరువుల పరిరక్షణ పేరుతో హడావిడి చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తాజాగా హైడ్రా ఆధ్వర్యంలో ఫెన్సింగ్ వేసిన ప్రభుత్వ భూములను బహిరంగ మార్కెట్‌లో విక్రయించాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.

నిజానికి హైడ్రా ఫెన్సింగ్ వేసిన చాలా ప్రాంతాల్లో ఎలాంటి అన్యాక్రాంతాలు, ఆక్రమణలు లేకపోయినా.. భారీ వ్యయంతో కేవలం ఫెన్సింగ్స్ ఏర్పాటు చేసి పెద్దఎత్తున పబ్లిసిటీ చేసుకున్నారు. ప్రభుత్వ భూములను కాపాడామంటూ చెప్పుకొచ్చిన సర్కార్ అసలు ఉద్దేశం ఇప్పుడు బహిర్గతమైంది. హైడ్రా ద్వారా భూములను గుర్తించి, హద్దులు ఏర్పాటు చేసి, ఆపై వాటిని అమ్ముకోవడానికే ఈ ఫెన్సింగ్ డ్రామా నడిపారనే విమర్శలు తీవ్రతరం అవుతున్నాయి.

ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే స్వయంగా వాటిని అమ్మకానికి పెట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు హైడ్రాకు మద్దతుగా ప్రకటనలు గుప్పించిన పెద్దమనుషులు, నాయకులు ఇప్పుడు ఈ భూముల విక్రయంపై ఏమని సమాధానం చెబుతారని ప్రజలు నిలదీస్తున్నారు.