హైడ్రాకు హైకోర్టు షాక్..

Published on: 07 May 2026, 06:49 AM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 07, 2026

హైదరాబాద్: చెరువుల పరిరక్షణ పేరుతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా (HYDRA) కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ ప్రాంతంలో చేపట్టిన కూల్చివేతలపై ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లాంఘించారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. ఐలాపూర్ భూములకు సంబంధించి 2004లోనే స్టేటస్ కో (యథాతథ స్థితి) కొనసాగించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, వాటిని బేఖాతరు చేస్తూ అధికారులు కూల్చివేతలు చేపట్టారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ హైడ్రా కమిషనర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మరియు ఇతర సంబంధిత రెవెన్యూ అధికారులకు నోటీసులు పంపింది. చట్టపరమైన నిబంధనలు పాటించకుండా, కోర్టు స్టే ఉన్న భూముల్లోకి ప్రవేశించి కూల్చివేతలు ఎలా చేస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణలోగా అధికారులు తమ సమాధానాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని సూచించింది. వరుసగా కోర్టు ధిక్కరణ కేసులు నమోదు అవుతుండటం హైడ్రా కార్యకలాపాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.