హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రంగారెడ్డి, జూలై 09, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపలి కోర్ అర్బన్ ఏరియాను పూర్తిగా కాలుష్య రహిత ప్రాంతంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో ప్రిమియర్ ఎనర్జీస్ సంస్థ నెలకొల్పిన 5.6 గిగావాట్ల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2,100 చ.కి.మీ విస్తీర్ణంలోని కోర్ అర్బన్ ఏరియాలో 1.35 కోట్ల మంది ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఇందులో భాగంగానే నగరంలోని పరిశ్రమలను ORR బయటకు తరలించడానికి చట్టం చేశామని, పారిశ్రామిక అవసరాల కోసం ఓఆర్ఆర్ వెలుపల 'పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ' జోన్‌ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌తో రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు మండళ్లుగా విభజించి, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్న ముఖ్యమంత్రి, ప్రకృతిని కాపాడుకుంటూనే పారిశ్రామిక అభివృద్ధికి యువతను బ్లూకాలర్ ఉద్యోగాల దిశగా సిద్ధం చేస్తున్నామని, ఇందులో భాగంగానే స్కిల్స్ యూనివర్సిటీ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రిమియర్ ఎనర్జీ యాజమాన్యం మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.