హైదరాబాద్‌లో డచ్ మహిళపై లైంగిక దాడి: పరారీలో నిందితుడు

Published on: 27 Jul 2026, 03:25 PM
News Article

హైదరాబాద్, జూలై 27, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): నగరంలోని కొండాపూర్‌లో నెదర్లాండ్స్‌కు చెందిన 36 ఏళ్ల విదేశీ మహిళపై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మార్చి 5 నుంచి 23 మధ్య భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చిన ఆ బాధితురాలు, కొండాపూర్‌లోని తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటోంది. బాయ్‌ఫ్రెండ్ లేని సమయంలో నిందితుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా పలుమార్లు లైంగికంగా వేధించాడు. మార్చి 17న ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అర్ధనగ్నంగా వచ్చి తాకుతూ, "తన స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది" అంటూ నిందితుడు అత్యంత అసభ్యంగా ప్రవర్తించాడు. సరిగ్గా అదే సమయంలో ఆమె ప్రియుడు ఇంటికి తిరిగి రావడంతో ఆ మహిళ పెను ప్రమాదం నుంచి, లైంగిక దాడి నుంచి తప్పించుకోగలిగింది. ఘటన అనంతరం తన దేశానికి (నెదర్లాండ్స్) తిరిగి వెళ్లిన బాధితురాలు, అక్కడ జరిగిన మొత్తం ఉదంతం గురించి తన బాయ్‌ఫ్రెండ్‌కు వివరించింది. ఆ తర్వాత డచ్ రాయబార కార్యాలయానికి (Dutch Embassy) సమాచారం అందించిన ఆమె.. అధికారికంగా ఫిర్యాదు చేసేందుకు జూలై 22న ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా గచ్చిబౌలి పోలీసులు బీఎన్‌ఎస్ (BNS) సెక్షన్లు 74, 75, 78, 79 కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు బీహార్ రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆదిత్య ఆనంద్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.