హైదరాబాద్, నవంబర్ 6, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తాగునీటి కష్టాలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. నగరంలో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందనేదానికి జలమండలి గణాంకాలే అద్దం పడుతున్నాయి. కేవలం ఒక్క అక్టోబర్ నెలలోనే నగరవ్యాప్తంగా దాదాపు 2.2 లక్షల వాటర్ ట్యాంకర్లు బుక్ కావడం గమనార్హం. ప్రస్తుతం నగరంలో రోజువారీగా సగటున 7 వేలకు పైగా ట్యాంకర్లు బుక్ అవుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
గతేడాది (2025) అక్టోబర్ నెలలో కేవలం 87 వేల ట్యాంకర్లు మాత్రమే వినియోగించగా.. ఈ ఏడాది అదే అక్టోబర్లో ఆ సంఖ్య ఏకంగా 2.2 లక్షలకు చేరుకోవడం నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షాకాలం ముగిసిన వెంటనే నీటి వనరులు అడుగంటడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ముందస్తు ప్రణాళికలు అమలు చేయడంలో విఫలమైందని, జలాశయాల్లో నీటి మట్టాలు ఆశాజనకంగా ఉన్నప్పుడే నిర్లక్ష్యంగా దిగువకు వదిలేయడం వల్లే నేడు ఈ దుస్థితి వచ్చిందని నిపుణులు, స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జలమండలి అధికారులు అప్రమత్తమై రాబోయే వేసవి కాలం నాటికి నగరంలో తాగునీటి కొరత తలెత్తకుండా తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.